CM Jagan Rayalaseema traitor: రాయలసీమలో సిరులు పండాలంటే ఆ ప్రాంతానికి ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయనంత ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డి పోవాల్సిందేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 జలవనరుల ప్రాజెక్టులు ఉంటే, వాటిల్లో సీమలోని 102 ప్రాజెక్టులను జగన్మోహన్ రెడ్డి ప్రీ క్లోజర్ చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేశ్ ఇప్పటికే డిక్లరేషన్ ప్రకటించారని గుర్తు చేసిన చంద్రబాబు... తాము అధికారంలోకి రాగానే సీమలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయటంతో పాటు ప్రీ-క్లోజర్ చేసిన 102 ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం కరవు ప్రాంతాన్ని కరవు ప్రాంతంగానే చూస్తుంది తప్ప... కులాలు, రాజకీయ కోణంలో చూడదని తేల్చిచెప్పారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో 102 జలవనరుల ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేయటమే కాకుండా వాటికి 5ఏళ్ల పాటు టెండర్లు పిలవొద్దంటూ జీవో కూడా ఇవ్వటాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ చేతకాక... ప్రీ క్లోజర్ చేసిన జగన్ను రాయలసీమ ద్రోహి అనకుండా ఇంకేమనాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీమకు తీరని ద్రోహం చేసిన పాపం జగన్మోహన్ రెడ్డిదేనని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని ఎంతలా సర్వనాశనం చేయొచ్చో సాగునీటి ప్రాజెక్టులే ఓ ఉదాహరణగా పేర్కొన్నారు. రాయలసీమకు చేస్తున్న అన్యాయం పట్ల జగన్‌కు సిగ్గనిపించడం లేదాని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వానికి కమీషన్లపై ఉన్న శ్రద్ధ రాయలసీమ ప్రాజెక్టుల మీద లేదని విమర్శించారు. రాష్ట్రంలోని 69 నదుల అనుసంధానం ద్వారా ప్రతీ ఎకరాకు నీరందించేలా రూపొందించిన ప్రణాళికను చంద్రబాబు ప్రజెంటేషన్ ద్వారా ఆవిష్కరించారు.
ప్రభుత్వ ప్రకటనల ఖర్చులు, సలహాదారుల జీతాలతో రాష్ట్రంలోని కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులు కొట్టుకుపోవటం, గేట్లు విరిగిపోవటం లాంటివి జరగలేదన్న చంద్రబాబు... వైసీపీ హయాంలో ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని విమర్శించారు. రాయలసీమకు, యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో ప్రాంతం కులం పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో తుపాను నివారించలేం కానీ కరవును నివారించవచ్చనితెలిపారు. రాళ్ల సీమ కాకూడదంటూ తెలుగు గంగ ద్వారా రాయలసీమకు ఎన్టీఆర్ ఊపిరి పోస్తే... గాలేరు నగరి, హంద్రీనీవా, పట్టిసీమల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు తెలుగుదేశం కృషి చేసిందని గుర్తుచేశారు. 2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68293 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ఖర్చు చేసింది రూ.22165కోట్లు మాత్రమేనన్నారు. మొత్తం బడ్జెట్ లో తెలుగుదేశం ప్రభుత్వం 9.63శాతం సాగునీటి రంగానికి ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు 2.35శాతం మాత్రమేనని చంద్రబాబు విమర్శించారు.
రాయలసీమలో ప్రాజెక్టుల కోసం తెలుగుదేశం హయాంలో రూ.12,441 కోట్లు ఖర్చు చేస్తే.. వైసీపీ హయాంలో రూ.2011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చంద్రబాబు విమర్శించారు. గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తిచేయబట్టే కియా ప్రాజెక్టు వచ్చిందన్నారు. రాజకీయ కక్షతో కుప్పానికి నీరందించ లేదని చంద్రబాబు దుయ్యబట్టారు. రాయలసీమకు గుండెకాయలాంటి ప్రాజెక్టు ముచ్చుమర్రిని తాము పూర్తి చేస్తే.. వైసీపీ కనీసం నిర్వహణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓ పక్క ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు అన్యాయం చేస్తూనే.. మరో వైపు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులను రక్షించ లేకపోతున్నారని విమర్శించారు. రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్టు పేరుతో భారీ అవకతవకలకు పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలోని ఇతర ప్రాంత ప్రాజెక్టులపై రేపు సమగ్ర వివరాలను ఆవిష్కరించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.