NTR centenary celebrations : హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20న నిర్వహించే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హాజరుకానున్నారు. ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్‌సైట్ కమిటీ ఆధ్వర్యాన సాయంత్రం 5గంటలకు జరిగే కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహచరుల అభిప్రాయాలు, శక పురుషుడు’ ప్రత్యేక సావనీర్, ఎన్టీఆర్ సమగ్ర జీవిత విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్’ వెబ్‌సైట్ ఆవిష్కరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
పాల్గొననున్న ప్రముఖులు... ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ సెక్రటరీ సీతారామ్ ఏచూరి, బీజేపీ జాతీయ నేత పురందీశ్వరి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కన్నడ చిత్ర హీరో శివకుమార్, తెలుగు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, దగ్గుబాటి వెంకటేష్, సుమన్, మురళీమోహన్, నందమూరి కళ్యాణ్‌రామ్, హీరోయిన్ జయప్రద, దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాతలు ఆదిశేషగిరి రావు, అశ్వనీదత్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్, వెబ్‌సైట్ ఆవిష్కరణలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, పలువురు ప్రముఖులకు కమిటీ పురస్కారాలు అందిస్తుందని వెల్లడించారు.