Samata Sainik Dal on NRI Kidnap Attempt: ట్రస్టు భూముల కోసం పోరాడుతున్న ఎన్నారై శ్రీనివాసరావు కిడ్నాప్‌కి హైకోర్టు వద్ద రెక్కీ నిర్వహించడం దారుణమని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు అన్నారు. శ్రీనివాసరావు పక్షాన న్యాయ సహయం చేస్తున్న న్యాయవాది పాలేటి మహేష్‌ను చంపేందుకు రెక్కీ చేశారని. ఆయనకు ప్రాణ హాని ఉందన్నారు. కబ్జాకు యత్నిస్తున్న వారి నుంచి ట్రస్ట్‌ను కాపాడుకోవడం కోసం సమతా సైనిక్ దళ్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
న్యాయవాది పాలేటి మహేష్‌కు ఏదైనా హాని జరిగితే.. దానికి రాష్ట్ర డీజీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హైకోర్టు ప్రాంగణం హై సెక్యూరిటీ జోన్లో ఉంటుందని.. అటువంటి ప్రాంతంలోనే రెక్కీ జరగటం దారుణమన్నారు. న్యాయవాదులకు కూడా రక్షణ లేకుండా పోయిందంటే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని సురేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రస్ట్ సభ్యులుగా ఉన్నహేమంత్.. ట్రస్ట్ ఆస్తులు కబ్జా చేశారని.. ఇటీవల కృష్ణలంక, పెనమలూరు పోలీస్ స్టేషన్లో శ్రీనివాసరావు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.
న్యాయవాది, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పాలేటి మహేష్ హత్య కుట్రపై జాతీయ ఎస్సి కమీషన్, డీజీపీలను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని సురేంద్ర అన్నారు. ప్రస్తుతం ఎన్నారై ఎక్కడ ఉన్నారో తెలియట్లేదని.. వారికి రక్షణ కల్పించాలన్నారు.
పిల్లి సురేంద్రబాబు , సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి "పేద ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఆ ట్రస్టులో సభ్యుడిగా ఉన్న హేమంత్.. ఇక్కడ ఉండి వైసీపీ నాయకులతో కుమ్మక్కయ్యాడు. వారితో కలిసి శ్రీనివాసరావును కిడ్నాప్ చేసేందుకు, తర్వాత హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ కూడా ఆయన ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. ఆయనని పోలీసులు, వైసీపీ నాయకులే కిడ్నాప్ చేశారని మాకు అనుమానంగా ఉంది. దీనిపై విచారణ జరగాలి". - పిల్లి సురేంద్రబాబు , సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి
అసలు ఏం జరిగిందంటే?:పెనమలూరుకు చెందిన ఎన్నారై శ్రీనివాసరావు తన న్యాయవాదితో కలిసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటానికి బుధవారం వచ్చారు. కోర్టు వెలుపల కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో తన న్యాయవాది మహేష్ ద్వారా బార్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పదంగా ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తాము పోలీసులమని నిందితుడిని పట్టుకోవటం కోసం సాధారణ దుస్తుల్లో వచ్చినట్లు తెలిపారు. దీంతో వారు పోలీసులు అని నిర్ధారించుకున్న తరువాత వారిని పంపించేశారు.