ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా చెల్లని ఓట్లు.. జయాపజయాలపై ప్రభావం - విజయవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు

కృష్ణా జిల్లాలోని నగర, పురపాలక ఎన్నికల్లో చాలామంది అభ్యర్థుల జయాపజయాలకు నోటా, చెల్లని ఓట్లు కూడా పరోక్షంగా కారణమయ్యాయి. విజయవాడ నగరపాలక సంస్థ సహా పెడన లాంటి పురపాలికల్లోనూ కొన్ని డివిజన్లు, వార్డుల్లో ఈ చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటమిపై ప్రభావం చూపించాయి. కొన్నిచోట్ల నోటా, చెల్లని ఓట్ల కంటే తక్కువ మెజార్టీతో కొందరు అభ్యర్థులు గెలిచారు.

nota votes high in vijayawada municipal elections
భారీగా చెల్లని ఓట్లు

By

Published : Mar 16, 2021, 3:34 PM IST

కృష్ణా జిల్లాలోని రెండు నగర పాలికలు, ఐదు పురపాలికల్లో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా 6793 మంది నోటాకు ఓటేశారు. ప్రస్తుతం ఎన్నికల్లో బరిలో ఉన్న ఏ అభ్యర్థి తమకు నచ్చలేదని తేల్చి చెప్పారు. జిల్లాలో మొత్తం పోలైన ఓట్లలో 11,537 చెల్లనివిగా అధికారులు తేల్చారు. సరిగా స్టాంపు వేయకపోవడం, రెండు గుర్తులకు మధ్యలో వేయడం సహా పలు కారణాలతో వీటిని చెల్లని ఓట్లుగా తేల్చారు. విజయవాడ నగరపాలక సంస్థలోని 1, 2, 3, 5, 6, 15, 20, 21, 22, 30, 31, 50, 51, 52, 57, 58, 60, 62, 63, 64 లాంటి డివిజన్లలో 200 నుంచి 300కు పైగా ఓట్లు నోటా, చెల్లని కోటాలో ఉన్నాయి. నగరం మొత్తంగా 64 డివిజన్లలో కలిపి చెల్లని ఓట్లు 8268 ఉండగా.. నోటాకు 4679మంది ఓటేశారు. మచిలీపట్నంలో నోటా, చెల్లనివి కలిపి 2,295 ఉన్నాయి. జిల్లాలోని తిరువూరు, పెడన, నూజివీడు, ఉయ్యూరు, నందిగామ ఐదుపురపాలికల్లో కలిపి మొత్తంగా 3088 ఓట్లు చెల్లని, నోటా కింద నమోదయ్యాయి. వీటిలో నోటాకు పడిన ఓట్లు 1,230, చెల్లని ఓట్లు 1,858 ఉన్నాయి.

చాలా చోట్ల ప్రభావం..

విజయవాడ 28వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి 78 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు 57 మంది ఓటేయగా, చెల్లని ఓట్లు 99 ఉన్నాయి. అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపించాయి. విజయవాడలోని 36వ డివిజన్‌లో వైకాపా అభ్యర్థి 105 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు 52 మంది ఓటేయగా.. చెల్లని ఓట్లు 64 ఉన్నాయి. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మెజార్టీ కంటే.. ఈ రెండే అధికంగా ఉన్నాయి.

విజయవాడలోని 12వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి 158 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు 84మంది ఓటేశారు. చెల్లని ఓట్లు 123 ఉన్నాయి. రెండు కలిపి 207 ఓట్లున్నాయి. గెలిచిన అభ్యర్థికి వచ్చిన మోజార్టీ కంటే ఇవి ఎక్కువ. విజయవాడ 39వ వార్డులో వైకాపా అభ్యర్థి 85 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ నోటాకు 80 మంది ఓటేశారు. చెల్లని ఓట్లు మరో 98 ఉన్నాయి. ఈ రెండు అభ్యర్థుల గెలుపుపై ఖచ్చితంగా ప్రభావం చూపించాయి.

పెడన ఏడో వార్డులో 13 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి గెలిచారు. ఇక్కడ చెల్లని ఓట్లు 21 ఉండగా.. నోటాకు ఏడుగురు ఓటేశారు. పెడనలోని 15వ వార్డులో 15 ఓట్ల మెజార్టీతో వైకాపా అభ్యర్థి గెలిచారు. ఇక్కడ కూడా చెల్లని ఓట్లు 22 ఉండగా.. నోటాకు ఐదుగురు ఓటేశారు.

ఇదీ చదవండి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు

ABOUT THE AUTHOR

...view details