మాస్కుల తయారీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఉపయోగపడే మాస్కుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. సకాలంలో వస్త్రం జిల్లాకు రాకపోవడమే ఇందుకు కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు కృష్ణా జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నారు. మాస్కులకు అవసరమైన వస్త్రం సరఫరా కాంట్రాక్టును ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. కొన్నాళ్లు సవ్యంగానే సాగిన సరఫరా ఆ తర్వాత ఆలస్యం కావడం ప్రారంభమైంది. గత పది రోజుల నుంచి సరఫరా పూర్తిగా ఆగిపోయింది. చేనేత సంఘాల నుంచి సేకరించే పరిస్థితి లేకపోవడం, ఇప్పటివరకు గోదాముల్లో ఉన్న నిల్వలు అయిపోవడంతో ఆప్కో చేతులెత్తేసింది. ఫలితంగా మాస్కుల తయారీకి బ్రేక్ పడింది.
ఈ పరిస్థితిపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇటీవల జరిగిన సమావేశంలో జిల్లా అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జాప్యాన్ని నివారించేందుకు స్థానికంగా వస్త్రాన్ని సేకరించే అవకాశం ఉంటే పరిశీలించమని కలెక్టర్ ఇంతియాజ్‌కు మంత్రి సూచించారు. దీనిపై అధికారులు పరిశీలించారు. విజయవాడలోని హోల్‌సేల్ వ్యాపారులను పిలిపించి మాట్లాడారు. స్థానికంగా కొనుగోలు చేయడానికి, ఉన్న బడ్జెట్‌లో కొంతవరకు వాడుకోవడానికి సంబంధించి ప్రతిపాదనలను తయారుచేశారు. మంత్రి పెద్దిరెడ్డి సూచన ప్రకారం ప్రభుత్వానికి పంపించారు.