కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరగలేదని... ప్రకాశం బ్యారేజీ వద్ద పూడిక తీసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు చెప్పింది. పర్యావరణానికి హాని కలిగించే రితీలో ముఖ్యమంత్రి నివాసం సమీపంలోనే కృష్ణా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని... అనుమోలు గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్జీటీ విచారించింది. నదిలో ఇసుక తవ్వకాలపై విచారించి నివేదిక సమర్పించాలని... గతంలో రూర్కీ ఐఐటీ ప్రొఫెసర్లతో ఓ కమిటీని ఎన్జీటి నియమించింది. ఆ కమిటీ ఇసుక తవ్వకాలను నిర్ధరిస్తూ... ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా.. ప్రభుత్వం తరఫున సమాధానాన్ని ట్రైబ్యునల్ కోరింది.
ఇసుక తవ్వకాలు జరగలేదని... జల రవాణాకు అనుగుణంగా పూడిక తొలగించినట్లు ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వెంకటరమణ ఎన్జీటికి చెప్పారు. ఇసుకను ఉచితంగా ఇచ్చినందున... అక్రమ రవాణాకు ఆస్కారం లేదని ఆయన ఎన్జీటికి వివరించారు. సరైన పర్యవేక్షణ లేకుండా పర్యావరణ అనుమతులు పాటించకుండా ఏ శాస్త్రీయ అధ్యయనంతో పూడిక తీశారని ఏన్జీటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూడికతీత, జల రవాణా కోసం డ్రెడ్జింగ్ చేసిన సమగ్ర వివరాలను నివేదిక రూపంలో 2వారాల్లో అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది.