ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిగ్రీ, పీజీ, బీటెక్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు! - ఏపీలో బీటెక్ పరీక్షలు రద్దు

డిగ్రీ, పీజీ, బీటెక్‌, వృత్తి విద్య కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేయాలనే అభిప్రాయం వర్సిటీల వీసీల సమావేశంలో వ్యక్తమైంది. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కష్టమని పలువురు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్‌కు వివరించి పరీక్షల రద్దుపై అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు.

exams in ap
exams in ap

By

Published : Jun 24, 2020, 4:30 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వర్సిటీల పరిధిలోని అన్ని కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని అభిప్రాయం వ్యక్తమైంది. పరీక్షల నిర్వహణ, అకడమిక్‌ క్యాలెండర్​పై వర్సిటీల ఉపకులపతులతో మంత్రి ఆదిమూలపు సురేశ్ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు చేస్తే మిడ్‌ సెమిస్టర్‌, ఇతర అంతర్గత పరీక్షల మార్కులు, వైవా ఆధారంగా చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. ఏ విధానం పాటించాలనే దానిపై వర్సిటీల పాలక మండళ్లల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. గత సంవత్సరాల్లో ఫెయిల్‌ అయిన సబ్జెక్టులుంటే వాటికి అంతర్గత మార్కులు, మౌఖిక పరీక్షల ఆధారంగా క్రెడిట్లు కేటాయించనున్నారు.

డిగ్రీ మొదటి రెండేళ్లు, బీటెక్‌ మూడేళ్లు, పీజీ తొలి ఏడాది విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానేపై తదుపరి విద్యా సంవత్సరానికి ప్రమోట్‌ చేయాలని అభిప్రాయపడ్డారు. ఈ అకడమిక్‌ ఏడాది ఆగస్టులో ప్రారంభమవనుండగా వారందరికీ ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు. అంబేడ్కర్‌, రాయలసీమ విశ్వవిదాలయాల్లో ఇప్పటికే పరీక్షలు నిర్వహించగా ఆ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. కొన్ని వర్సిటీల్లో కేవలం కొన్ని సబ్జెక్టులకే పరీక్షలు జరగ్గా మిగతావాటికి అంతర్గత మూల్యాంకనం ద్వారా క్రెడిట్లు కేటాయించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details