ఎవరివద్దా అదనంగా కరెంట్ బిల్లులు వసూలు చేయటం లేదని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ తెలిపారు. మార్చి, ఏప్రిల్ బిల్లులు కలిపి ఇచ్చారనే అపోహ ప్రజల్లో ఉందని... అయితే 2 నెలల బిల్లులూ విడివిడిగా లెక్క కట్టామని స్పష్టం చేశారు. ఐదేళ్లుగా మార్చిలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం విద్యుత్ వినియోగం ఉంటుందని చెప్పారు. ఏప్రిల్‌లో అదనంగా వచ్చే యూనిట్లలో 4 శాతాన్ని మార్చిలో కలిపామని వివరించారు. మార్చి, ఏప్రిల్ బిల్లులకు విడివిడిగా ఎస్ఎంఎస్‌లు పంపుతున్నామని చెప్పారు.
అలాగే మార్చికి గతేడాది టారిఫ్.. ఏప్రిల్‌కు కొత్త టారీఫ్ ప్రకారం బిల్లులు ఉంటాయని సీఎండీ వెల్లడించారు. వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ జరిగిందని ట్రాన్స్‌కో సీఎండీ అన్నారు. ఎక్కడా ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ జరగలేదని చెప్పారు. సమస్యల పరిష్కారానికి జిల్లాలకు ప్రత్యేక అధికారులు నియమించామని... అపోహలు ఉంటే 1912కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.