ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నవీ రాష్ట్ర అప్పులే.. ఏపీ 'బహిరంగ రుణం' రూ.3.98 లక్షల కోట్లు' - ఆంధ్రప్రదేశ్​ అప్పులు

ఆర్‌బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్‌ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్‌ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించి కేంద్రం అనుమతించిన నికర రుణ పరిమితి మేరకు బహిరంగ మార్కెట్‌ నుంచి చేసిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ 8వస్థానంలో నిలిచింది.

Slug nirmala seetaraman about andhrapradesh loans
Slug nirmala seetaraman about andhrapradesh loans

By

Published : Jul 26, 2022, 4:08 AM IST

Nirmala Seetaramana Ap State Detbts: ఆర్‌బీఐ ద్వారా తీసుకున్న బహిరంగ మార్కెట్‌ రుణాలే కాకుండా.. కొన్ని రాష్ట్రాలు తమ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థలు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌, ఇతర సాధనాల ద్వారా రుణాలు తీసుకుని వాటికి సంబంధించిన అసలు, వడ్డీని బడ్జెట్‌ నుంచే చెల్లిస్తున్నట్లు ఆర్థికశాఖ దృష్టికి వచ్చినట్లు నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల భారంపై భాజపా సభ్యుడు కిషన్‌ కపూర్‌ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ పలు అంశాలను వెల్లడించారు. కేంద్రం ఇచ్చిన నికర రుణ పరిమితిని ఉల్లంఘిస్తూ పక్కదారుల్లో రుణాలు తీసుకోవడం తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయంపై మార్చిలో రాష్ట్రాలను హెచ్చరించినట్లు చెప్పారు.

ఇలా ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌ నుంచి కానీ, లేదంటే రాష్ట్ర పన్నులు, సెస్సులు, ఇతర ఆదాయాలను అసైన్‌మెంట్‌ చేసి కానీ చెల్లిస్తే వాటిని ఆర్టికల్‌ 293(3) కింద రాష్ట్రం చేసిన అప్పులకిందే పరిగణిస్తామని స్పష్టం చేశామన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని అనుసరించి కేంద్రం అనుమతించిన నికర రుణ పరిమితి మేరకు బహిరంగ మార్కెట్‌ నుంచి చేసిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ 8, తెలంగాణ 11వ స్థానంలో నిలిచాయి. దేశంలోని 28 రాష్ట్రాలు కలిపి 2022 మార్చి చివరి నాటికి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.68 లక్షల కోట్లు అప్పు చేయగా అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ.3,98,903 కోట్లు, తెలంగాణ వాటా రూ.3,12,191 కోట్లుగా ఉంది. 2020 నుంచి 2022 మధ్య ఆంధ్రప్రదేశ్‌ అప్పు రూ.91,232 కోట్లు పెరిగింది. ఇదే సమయంలో తెలంగాణ రుణం రూ.86,773 కోట్లు ఎగబాకింది.

ఏపీకి 14వ ఆర్థిక సంఘం నిధులేమీ బకాయి లేం.. 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2020 మార్చి 31తో ముగిసిపోయిందని, దాని ద్వారా ఏపీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఆమె సోమవారం లోక్‌సభలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 14వ ఆర్థిక సంఘం 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.8,653 కోట్లు సిఫారసు చేయగా రూ.8,124 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీ సహా అన్ని రాష్ట్రాల స్థానిక సంస్థలకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.

కేంద్ర అప్పులు రూ.155 లక్షల కోట్లు.. గత అయిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.62.83 లక్షల కోట్ల మేర పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. 2018-19లో రూ.92.50 లక్షల కోట్ల మేర ఉన్న అప్పు 2022-23 నాటి బడ్జెట్‌ అంచనాల ప్రకారం రూ.155.33 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఆయన సోమవారం లోక్‌సభలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 2020-21లో కేంద్ర అప్పులు జీడీపీలో 9% పాయింట్ల మేర పెరిగినట్లు చెప్పారు. కొవిడ్‌ మహమ్మారి తీవ్రత, ప్రభుత్వ ఆర్థిక అంచనాలు భారీగా తప్పడం, జీడీపీ తగ్గుముఖం పట్టడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. కొవిడ్‌ కారణంగా ఆదాయం పడిపోయినప్పటికీ ప్రజల జీవితాలు, జీవనోపాధులను రక్షించడానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్రం కేటాయింపులు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక కొలమానాలన్నీ స్థిరంగానే ఉన్నట్లు చెప్పారు.


ఇదీ చదవండి:ఆహార భద్రత కార్డుల్లో భారీ మార్పుచేర్పులు.. ఉత్తరాంధ్ర, సీమలో అధికంగా!

ABOUT THE AUTHOR

...view details