పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా విజయవాడను నందనవనంగా మార్చాలని భావిస్తోంది నగర పాలక సంస్థ. నగరంలోని ప్రతీ ప్రాంతానికి ఒక పార్కు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. గతంలో డంపింగ్ యార్డులుగా మారిన ప్రభుత్వ స్థలాల్లో..పచ్చటి పార్కుల నిర్మాణానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే పలు పార్కులను సర్వాంగ సుందరణంగా అభివృద్ధి చేసిన మున్సిపల్ శాఖ..మోడల్ పార్కుల పనుల వేగం పెంచింది.
విజయవాడలో సింగ్‌నగర్-వాంబే కాలనీల మధ్య 13 ఎకరాల ప్రభుత్వం స్థలం పూర్తిగా డంపింగ్ యార్డుగా ఉండేంది. ఆ ప్రాంతాన్ని మోడల్ పార్కుగా ఏర్పాటు చేసేందుకు 10 కోట్ల రూపాయలతో పనులను గతేడాది ప్రారంభించింది నగర పాలక సంస్థ. పార్కులో కేవలం కూర్చునే సదుపాయం మాత్రమే కాకుండా.. పిల్లలకు ఆటస్థలం, నడకదారి,అత్యంత అహ్లాదకరంగా ఉండేందుకు ప్రత్యేకమైన మొక్కలు, ఎడ్యుకేషన్ మ్యూజియం, కుటుంబ సమేతంగా గడిపేందుకు ప్రత్యేకమైన వసతులు కల్పించనున్నారు. దీంతోపాటు నగరంలోని రాఘవయ్య పార్క్, లెనిన్ పార్క్, రాధానగర్ పార్కులను అభివృద్ధిపరుస్తున్నారు.
గతంలో దుర్గందం వెదజల్లే ప్రాంతాన్ని సుందరమైన పార్కులా నగరపాలక సంస్థ అభివృద్ధి చేస్తుండటం పట్ల ఆ ప్రాంతాల వాసులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ మార్గం గుండా వెళ్లాలంటే డంపింగ్ యార్డ్ ఉండటం వలన విపరీతమైన చెడు వాసన వచ్చేది. చెత్త నిర్వహణ సరిగా ఉండకపోవటంతో రహదారిపై కూడా చెత్త పేరుకుపోయేది. గుట్టలుగా చెత్త ఉండే ప్రాంతాన్ని పచ్చని పార్కుగా మార్చడం పట్ల నగరవాసులు సంతోషిస్తున్నారు. ఎంతో కాలంగా ఉన్న సమస్యకు పార్కు రూపంలో పరిష్కారం దొరికిందని చెబుతున్నారు. ఇంతకుముందు చెత్త ఉండడంతో పాములు, ఎలుకలు, దోమలతో అనేక ఇబ్బందులు పడేవాళ్లమని.. పార్కు నిర్మాణంతో పరిస్థితి మారిందని అంటున్నారు.
"ఇక్కడ చెత్త ఉండటంతో విపరీతమైన చెడు వాసన వచ్చేది.విజయవాడలోనే అతిపెద్ద ఐకానిక్ పార్కు ఇక్కడ ఏర్పాటు చేయడం వలన వాసన, దోమలు,ఎలుకలు బాధ తప్పింది. మాకు చాలా ఆనందంగా ఉంది." -స్థానికుడు.