కృష్టా జిల్లాలో..
దేశం కోసం, ప్రజల కోసం జీవించి.. అందుకోసమే మరణించిన వారిని “హీరోలుగా భావించి, వారి అడుగుజాడలలో నడవడానికి యువతరం ప్రయత్నించాలని మాజీ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ సూచించారు. దివిసీమ లలిత కళాసమితి మరియు గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో.. అవనిగడ్డ గాంధీక్షేత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో మండలి మాట్లాడుతూ నేతాజీ త్యాగనిరతికి, దేశభక్తికి పర్యాయపదమని... వారందించిన “జైహింద్” నినాదం దేశ నినాదమైందని గుర్తు చేసుకున్నారు. మహత్మాగాంధీతో సైద్దాంతిక విభేదాలున్నప్పటికీ జాతిపితగా ఆయన్ని మొదటగా సంబోధించింది నేతాజీనేనని మండలి బుద్ద ప్రసాద్ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కావలసిన ధైర్య సాహసాలకు నేతాజీ జీవితమే మనకు స్ఫూర్తిదాయకం కావాలని అన్నారు. నేతాజీ మృతిపై రకరకాల వాదనలు ఉన్నప్పటికీ భారత జాతి ఉన్నంతకాలం జీవించే ఏకైక వ్యక్తి నేతాజీ మాత్రమేనని మండలి పేర్కొన్నారు. విద్యార్థులు దేశభక్తి గీతాలను పాడటం మాత్రమే కాకుండా అందులో ఉండే సారాంశాన్ని కూడా జీవితంలో నింపుకోవాలని కోరారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కవి వేమూరి రాజేష్ మాట్లాడుతూ నేతాజీ 125వ జయంతోత్సవం-గాంధీ క్షేత్రంలో జరపడం ఆనందంగా ఉందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్ దారులు వేరైనా అందరి ఆశయం మాత్రం ఒక్కటేనని అన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా స్వతంత్ర సమరయోధులు స్ఫూర్తిగా తీసుకోవాలని, ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ రూల్స్ విధిగా పాటించడం విధిగా నిర్వర్తించాలని కోరారు.