రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల టెండర్లు, పాలనాపరమైన కార్యకలాపాలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. తుది తీర్పు వెలువడే వరకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమా.. కాదా అనే విషయాన్ని కేంద్ర పర్యావరణశాఖ పరిశీలించి తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు చెన్నైలోని ఎన్‌జీటీ జోనల్ బెంచి సోమవారం వివరణ ఇచ్చింది. మే 20న ఈ పథకం పనులు ఆపేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను సవరించింది. తమ ఉద్దేశం నిర్మాణ పనులు చేపట్టవద్దని తప్ప టెండర్లు, పాలనాపరమైన అంశాల నిలిపివేత కాదని పేర్కొంది. చెన్నై జోనల్ బెంచిలోని జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ మెంబర్ దాస్‌గుప్తాలు వీడియో సమావేశంలో ఏపీ ప్రభుత్వ వాదనను విన్నారు. తర్వాత ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. కేసు విచారణను ఆగస్టు 11కు వాయిదా వేశారు. తెలంగాణలోని నారాయణపేట జిల్లా బాపనపల్లికి చెందిన గవినోళ్ల శ్రీనివాస్ రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయాలంటూ ఎన్‌జీటీని ఆశ్రయించారు.
- వాళ్లది అనధికార ప్రాజెక్టు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనధికారికంగా చేపట్టిన ప్రాజెక్టు అని, దీనికి పర్యావరణ అనుమతి లభించలేదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలవల్ల ఆ ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపింది. ‘పాలమూరు-రంగారెడ్డి’ని రిజర్వ్ ఫారెస్టులో నిర్మిస్తున్నారని, ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల పరస్పరం అంగీకారం తెలిపిన వాటి జాబితాలో లేదంది. ఆంధ్రప్రదేశ్ తరఫున ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఎన్‌జీటీలో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రాజెక్టు వారీగా కేటాయింపులు, నిర్వహణ కార్యాచరణను రూపొందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం కృష్ణా జల వివాద ట్రైబ్యునల్-2కు ఇచ్చిందని తెలిపింది.