వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇసుక నూతన పాలసీ అంటూ 4 నెలలు తాత్సరంచేసి 60మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేలా చేశారని నారా లోకేశ్ మండిపడ్డారు. కార్మికులను ఆదుకోవాలని సీఎం జగన్ కు లేఖరాశారు.
కొత్తగా తీసుకొచ్చిన ఇసుక పాలసీతో రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఇసుక మాఫియా కోట్లకు పడగలెత్తితే.. భవన నిర్మాణ రంగం కుప్పకూలిందని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఇసుక మాఫియా ఏ స్థాయిలో ఉందో తాజాగా ఓ మంత్రికి ఇసుక బదులు మట్టి పంపించిన ఘటనే నిదర్శనమన్నారు. ఇదంతా స్టాక్ యార్డు ముసుగులో జరుగుతున్న దోపిడీ అనీ.. అధికారులు, వైకాపా నేతలే ఇందులో సూత్రదారులన్నది స్పష్టమవుతోందని చెప్పారు.
ఇసుక అక్రమాలను సహించబోనని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధిస్తే.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి భవన నిర్మాణ కార్మికులను ఆదుకున్నాయని గుర్తు చేశారు.