‘మా పార్టీ కార్యాలయంలో మేం ఎవరూ లేనప్పుడు పిరికిపందల్లా వచ్చి నాలుగు అద్దాలు పగలగొట్టి, పారిపోతే భయపడం. మా నాయకుల్ని, కార్యకర్తల్ని వదిలేస్తే మీ వీపులు పగులుతాయి. మీకు పోరాడాలన్న సరదా ఉంటే ఎదురుగా రండి’’ అని వైకాపా నాయకులపై తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తెదేపా కార్యాలయంపై వైకాపా కార్యకర్తలతో దాడి చేయించినందుకు ముఖ్యమంత్రి జగన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని(nara lokesh fires on cm jagan) ఆయన బుధవారం విలేకర్ల సమావేశంలో హెచ్చరించారు.
‘మా నాయకుడు చంద్రబాబుకు ఓపిక ఎక్కువ. ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపిస్తారు. మేమైతే రెండు చెంపలూ వాయిస్తాం. దాడి జరిగాక మా వాళ్లు వైకాపా కార్యాలయంపైకి వెళదామంటే నేనే ఆపాను. ఇప్పటికే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. శాంతిభద్రతలూ లేవని తెలిస్తే ఇంకెవరూ రారు. అందుకే సంయమనం పాటించాం’ అని పేర్కొన్నారు. ‘మిమ్మల్ని అంటే వైకాపా కార్యకర్తలకు మాత్రమే బీపీ వస్తుందేమో.. చంద్రబాబును అంటే మొత్తం రాష్ట్రానికే బీపీ వస్తుంది’ అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి లోకేశ్ వ్యాఖ్యానించారు. కేంద్రం రాష్ట్రంలో తక్షణం ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పరుషంగా మాట్లాడలేదని బుధవారం ఉదయం అమాయకుడిలా మాట్లాడారని లోకేశ్ ఎద్దేవా చేశారు. ‘సీఎం కాలర్ పట్టుకోండి, చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చి చంపినా తప్పులేదు, ఉరిశిక్ష వేసినా తప్పు లేదు, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలి. ముఖ్యకంత్రి, జైల్లో పెట్టి తన్నాలి అన్నది ఎవరు? ఆ రోజు చంద్రబాబు ఒక్క మాటంటే జగన్ పాదయాత్ర జరిగేదా?’ అని లోకేశ్ పేర్కొన్నారు. జగన్‌తోపాటు వైకాపా నేతలు ధర్మాన కృష్ణదాస్, చంద్రశేఖర్‌రెడ్డి, కొడాలి నాని, పార్థసారథి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రోజా తదితరులు చంద్రబాబుపై పరుష పదజాలం ప్రయోగించిన వీడియోల్ని ఆయన ప్రదర్శించారు.