కృష్ణా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలు.. పక్క రాష్ట్రం తెలంగాణకు వెళ్లి సినిమా చూస్తున్నారు. వరుస సెలవులు ఉండటంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో థియేటర్ల మూసివేతతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ జీవో 35ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో తమకు ధరలు గిట్టుబాటు కావడం లేదని కృష్ణా జిల్లా నందిగామలో సినిమా థియేటర్ల యజమానులు, నిర్వాహకులు.. స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేశారు. దీంతో నందిగామలో మూడు థియేటర్లు ఐదు రోజులుగా నడవడంలేదు.
క్రిస్మస్ పండుగ, శని, ఆదివారాలు సెలవులు కావడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు.. సరిహద్దులోని మధిర, బోనకల్, తదితర ప్రాంతాలకు వెళ్లి చూస్తున్నారు. లేదంటే విజయవాడకు వెళ్లి సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినిమా హాళ్ల మూసివేతతో ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.