ముఖ్యమంత్రి జగన్ గురువారం ప్రారంభించిన 'జగనన్న విద్యా కానుక' నూతన పథకం కాదని అన్నారు తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. గత ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే కిట్లకు కొన్ని వస్తువులు జోడించారన్నారు. దీని కోసం 8,9వ తరగతి విద్యార్ధులకు ఇచ్చే సైకిళ్ల పంపిణీని రద్దు చేశారని విమర్శించారు. రెండేళ్ల క్రితం తెచ్చిన సైకిళ్లను ఇప్పటికీ ఇవ్వకపోవటంతో అవి తుప్పుపట్టి పాడయ్యాయని దుయ్యబట్టారు. విద్యార్ధులకు ఇచ్చే కిట్లో సైకిళ్ల పంపిణీని చేర్చాలని డిమాండ్ చేశారు.
నవరత్నాల అమలుకు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆనంద్ బాబు విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 11పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. ఆ పథకాల వివరాలను త్వరలోనే బయటపెడతామన్నారు.