Nagayalanka Gullalamodu Road Highly Damaged: ఏపీలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కృష్ణా జిల్లా గ్రామీణ రహదారులు ఇందుకు నిదర్శనమేనని జిల్లా ప్రజలు మరమ్మతులకు గురైన రోడ్లను చూపిస్తున్నారు. ఈ రహదారులు నరకానికి నకళ్లుగా మారుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కొన్ని రహదారులు ప్రమాదాలకు కేరఫ్ అడ్రస్‌గా మారిపోయాయని ప్రయాణికులు అంటున్నారు. ఈ రహదారుల గుండా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా కృష్ణా జిల్లాలోని నాగయలంక రహదారి: జిల్లాలోని నాగాయలంక - గుల్లలమోదు రహదారి అడుగుకో గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారిపై వెళ్లాలంటేనే వాహనదారులు.. రోడ్లతోనూ, వాహనాలతోనూ కుస్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై ఏర్పడిన గుంతల వల్ల వాహనాలు అదుపులో ఉండటం లేదని ప్రయాణికులు వాపోతురున్నారు. రహదారి మరమ్మతులు చేయాలని.. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు నిర్వహించి.. రహదారి బాగు చేయాలని అటుగా వెళ్తున్న ప్రయాణికులు కోరుకుంటున్నారు.
3కిలోమీటర్ల మేర మరి దారుణం: అయితే ఇంత అధ్వాన్నంగా తయారైన ఈ రహదారి.. మొత్తం 12 కిలోమీటర్ల దూరం వరగు పూర్తిగా పాడైపోయింది. ఈ దూరంలో భారీ గుంతలతో నిండిపోయింది. పెదపాలెం-కొత్తపాలెం మధ్య సుమారు 3కిలోమీటర్ల వరకు మరింత దారుణంగా తయారైంది. ఈ ప్రాంతంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. కొందరు ప్రయాణికులు ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.