NADU-NEDU SCHOOLS WORKS: నాడు-నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం సహా వివిధ పనులను ప్రభుత్వం చేపట్టింది. విద్యార్థులకు సరిపడినన్ని గదులు నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ పనులు రోజుల తరబడి సాగుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది పాఠశాలలు జరుగుతున్నప్పుడే పనులు చేయడంతో ఇబ్బంది పడగా.. ఈ వేసవిలో పనులన్నీ పూర్తిచేసి విద్యా సంవంత్సరం ప్రారంభయ్యే నాటికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అయినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. దీంతో పాటు నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారు. తొలిదశ పనుల్లో నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడంతో నెలల వ్యవధిలోనే మరుగుదొడ్లు, మూత్రశాలల్లో సింకులు, నల్లాలు విరిగిపోయాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా రెండోదశ పనుల్లో 578 తరగతి గదుల నిర్మాణం చేపట్టగా.. కనీస స్థాయిలోనూ పనులు జరగలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే వీటి నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా.. ఇప్పటికి సగం పనులు కూడా కాలేదు. విజయవాడలో స్థలం లేకపోవడంతో పాత భవనాలపైనే మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పాత భవనాల సామర్థ్యం పరీక్షించకుండానే కొత్త నిర్మాణాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
"గవర్నమెంట్ స్కూల్స్‌ను అభివృద్ధి చేసేందుకు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాడు-నేడు కార్యక్రమం చేపట్టినట్లు చెప్తోంది. అయితే ఈ కార్యక్రమం ప్రారంభించి రెండున్నరేళ్లు అవుతున్నా.. పాఠశాలల్లో పనులు మాత్రం పూర్తి కాలేదు. ఇలా అయితే వచ్చే విద్యాసంవత్సరంలో ఉన్న ఐదు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏ విధంగా విద్యను అందిస్తారని మేము ప్రశ్నిస్తున్నాము." - సోమేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు