గూడూరు మండలం మల్లవోలులో నిర్మాణ దశలో ఆగిన పాఠశాల భవనం
ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలని నాడు..నేడు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. పనులను తల్లిదండ్రుల కమిటీలే చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వహణపై సరైన ప్రణాళిక లేక, ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేక పోవడం తదితర కారణాలతో ప్రస్తుతం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ఒత్తిళ్లు పెట్టి పనులు చేయించడంతో తరువాత నిధులు మంజూరవుతాయిలే అని చాలామంది తమ సొంత నిధులు పెట్టుబడి పెట్టి అప్పుల పాలయ్యామంటూ ఆవేదన చెందుతున్నారు.
ఎప్పట్లో పూర్తవుతాయో!
● జిల్లావ్యాప్తంగా తొలివిడతగా 1153 పాఠశాలలను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. మరుగుగొడ్లు, తాగునీటి సరఫరా, భవనాల మరమ్మతులు ఇలా అనేక పనులు చేపట్టారు. నూరుశాతం పూర్తి చేయడంపై ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ సమాయానికి పూర్తికాకపోవడంతో మళ్లీ గడువు పెంచుతున్నారు.
మచిలీపట్నం, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల్లో 80శాతం వరకు పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టిన ప్రధానోపాధ్యాయులు ఇంకా వెచ్చించలేని పరిస్థితుల్లో చాలామంది పనులు నిలిపివేశారు.
రూ.20 కోట్ల బకాయిలు
నిధులు సకాలంలో అందకపోవడంతో ఒక్కో ఉపాధ్యాయుడు రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. తరువాత నిధులు విడుదల అవుతాయని భావించి హడావుడిగా పనులు చేయించారు. జులై నుంచి ఇప్పటివరకు నిధులు విడుదల కాకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రుల కమిటీల్లో ఉన్న నాయకులు కూడా ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు తెచ్చారు. పనుల్లో పాల్గొన్న కూలీల సంఖ్య పెంచి రాయాలని, తాము చెప్పిన దుకాణాల్లోనే సామగ్రి కొనుగోలు చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు.
ఇవిగో అడ్డంకులు
గూడూరు మండలంలో 24 పాఠశాలల్లోని నాడు-నేడులో భాగంగా పనులు చేపట్టారు. ఈ పనుల నిమిత్తం రూ.3.32 కోట్లు కేటాయించారు. చివరిదశలో నిధులు మంజూరు కాకపోవడంతో మల్లవోలు, కప్పలదొడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలతోపాటు తరకటూరు, రాయవరం, కంచాకోడూరు ప్రధాన ప్రాథమిక పాఠశాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.