Muslim Man Celebrates Ganesh Chaturthi : హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ సిద్ధిఖీ అనే యువకుడు ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నాడు. ముస్లిం అయినా తాను అన్ని మతాలను గౌరవిస్తానని అంటున్నాడు. ముఖ్యంగా హిందూ మతంలో వేడుకలు ఎక్కువగా జరుగుతుంటాయని.. తనకు అందరితో కలిసి పండుగలు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టమని చెబుతున్నాడు. ముఖ్యంగా గణేశ్ నవరాత్రులంటే తనకు చాలా మక్కువ అని తెలిపాడు. చిన్నప్పటి నుంచి తన హిందూ స్నేహితులు వినాయక చవితికి సంబురాలు చేసుకోవడం చూసి తాను కూడా అందులో పాల్గొనేవాడినని అన్నాడు.
తెలంగాణలో 18 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్న ముస్లిం వ్యక్తి
Muslim Man Celebrates Ganesh Chaturthi : తెలంగాణ గణేశ్ ఉత్సవాల్లో మతసామరస్యం వెల్లివిరుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల్లో హిందూ ముస్లింలు కలిసి వినాయక నవరాత్రులను సంబురంగా జరుపుకొంటున్నారు. మతతత్వంతో కొందరు కొట్లాడుకుంటున్న తరుణంలో తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరియడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కలిసి పండుగలు జరుపుకోవడమే కాదు. ఓ ముస్లిం వ్యక్తి ఏకంగా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఈ నవరాత్రులు పూజలు కూడా చేస్తున్నాడు.
గత 18 ఏళ్ల నుంచి నేను స్వయంగా గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాను. హిందూ, ముస్లిం అని మనుషుల్ని వేరు చేసి చూడటం నాకు నచ్చదు. మనమంతా ఒకటే. మనుషులంతా ఒకటేనని నేను నమ్ముతాను. మతాలు వేరైనా కొలిచే దేవుళ్లు వేరైనా అందరిపైనా ఉండేది ఒకే శక్తి. ఆ శక్తికి కట్టుబడి ఉండటమే మన కర్తవ్యమని నమ్ముతాను. నాకున్న ఫ్రెండ్స్‌లో చాలా మంది హిందువులే. వాళ్లు నాతో పాటు మసీద్‌కు వస్తారు. నేను వారితో పాటు గుడికి వెళ్తాను. ఇలా పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాను. మనం భూమిపై ఉండేది కొన్నాళ్లే.. ఆ కొన్నాళ్లు కూడా నీది నాది అని కొట్లాడుకోకుండా అందరం కలిసి హ్యాపీగా జాలీగా బతకాలన్నదే నా ఫిలాసఫీ. అని చెబుతున్నాడు మహ్మద్ సిద్ధిఖీ.