తొమ్మిది నగర పాలకసంస్థలు, 120 పురపాలక సంస్థలు, మొత్తం 3,052 వార్డులు, దాదాపు 13వేల మంది అభ్యర్థులు, 50లక్షల వరకు ఓటర్లు. హోరాహోరీగా సాగిన తెలంగాణ పురపోరు ప్రక్రియ నేటితో పూర్తి కానుంది. ఏకగ్రీవాలతో కలిపితే కార్పొరేటర్, మున్సిపాలిటీల్లో మొత్తం 3,052 వార్డులున్నాయి. వార్డుసభ్యుల పదవుల కోసం మొత్తం 12వేల 948 మంది ఎన్నికల బరిలో నిలిచారు. పార్టీలపరంగా చూస్తే అధికార తెరాస నుంచి 2,975 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరపున 2,619 మంది, భాజపా నుంచి 2,321 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తెలుగుదేశం తరపున 347 మంది, మజ్లిస్ నుంచి 297 మంది పోటీ చేశారు. సీపీఐ, సీపీఎంల నుంచి 180, 165 మంది ఎన్నికల బరిలో నిలిచారు. ఇతర పార్టీల అభ్యర్థులు 284 మంది కాగా... స్వతంత్రులు 3,760 మంది ఉన్నారు.
తెలంగాణలో పురపోరు ...భవితవ్యం తేలేది నేడే!
తెలంగాణ పట్టణ, నగర ప్రజాప్రతినిధులు ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. నగర, పురపాలక సంస్థల్లోని 2,971 వార్డుల ఫలితాలు నేడు వెల్లడి కానున్నాయి. తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలీటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపు కోసం 134 కేంద్రాల్లో 2,559 టేబుళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా మొత్తం ఫలితాలు వెల్లడి కానున్నాయి.
ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నిజామాబాద్ లెక్కింపు కోసం ఐదు, బడంగ్ పేట్, నారాయణ్ ఖేడ్ లెక్కింపు కోసం రెండు చొప్పున కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటి లెక్కింపు కోసం ఒక్కొక్కటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. కౌంటింగ్ ప్రక్రియకు మొత్తం పది వేల మంది సిబ్బందిని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం బ్యాలెట్ బాక్సులను తెరిచి అందులోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక విజేతను ప్రకటించే ముందు సంబంధిత రిటర్నింగ్ అధికారి ఎన్నికల పరిశీలకుని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పరిశీలకుని అనుమతి తీసుకున్నాకే తుదిఫలితానికి సంబంధించిన షీట్‌పై సంతకం చేసి విజేతలను ప్రకటించాలని స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: విజయవాడ చేరుకున్న తెలంగాణ పోలీసులు