అధికారుల సన్నద్ధం..!
మున్సిపల్ ఎన్నికలకు అధికారులు సిద్ధం అవుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, కౌంటింగ్ తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడతలో పోలీసు సిబ్బందికి శిక్షణనివ్వనున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిపిన అనుభవంతో.. అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్ తెలిపారు.
పరామర్శిస్తే ఎదురు దాడా..!
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నందిగామ పట్టణంలో తెదేపా ప్రచారం చేపట్టింది. 13వ వార్డులో ఛైర్మన్ అభ్యర్థిని శాఖమూరు స్వర్ణలత, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని వేపూరి ఉషారాణి, మాజీ ఎమ్మెల్యే తంగిరాసౌమ్య, తెదేపా నేత పిల్లిమాణిక్యాలరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు పలువురు ప్రచారం చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటిపై దాడి చేయడం వైకాపా దమన కాండకు నిదర్శనమని పిల్లి మాణిక్యాలరావు అన్నారు. సాటి మహిళకు అన్యాయం జరిగితే మానవతావాదంతో మాజీ ఎమ్మెల్యే పరామర్శిస్తే ఎదురుదాడి చేస్తారా అని మండిపడ్డారు. 6, 5 వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం 6వ వార్డులో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు.
అవినీతి అక్రమార్కుల పాపం పండింది
అమరావతి రాజధానిని ముక్కలు చేసిన ఘనత వైకాపాదేనని.. వారి పాలనలో విజయవాడ నగరం అభివృద్ధిలో ఆమడదూరం వెళ్లిపోయిందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ విమర్శించారు.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ 34వ డివిజన్ అభ్యర్థి ఆకుల రాధాకిరణ్తో కలిసి కేదారేశ్వరపేటలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు.. విజయవాడ నగరంలో వైకాపాని గెలిపిస్తే నగరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తారని ప్రజలు అందరూ విజ్ఞతతో అభివృద్ధి కోసం జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు బినామి, దుర్గ గుడి ఈవో సురేష్ బాబు పై విచారణ జరుగుతుండటం శుభపరిణామమని అన్నారు. తమ పోరాట ఫలితంగానే దుర్గగుడిలో అవినీతి అక్రమార్కుల పాపం పండింది అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:పర్యావరణాన్ని కాపాడేందుకు.. ఒక్క అడుగు!