విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులే గడువు ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో కృష్ణలంకలోని ఎక్కువ డివిజన్లలో వైకాపా అభ్యర్థులు గెలుపొందడంతో.. ఈ సారి ఆ ప్రాంతంలో పట్టు సాధించేందుకు తెదేపా ప్రచారపోరుపై దృష్టి సారించింది. అక్కడి డివిజన్లలో ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని తెదేపా అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కృష్ణలంక 22 వ డివిజన్ అభ్యర్థి చందన సురేష్ తరుపున ఎమ్మెల్యే గద్దె, ఎంపీ నానిలు పార్టీ శ్రేణులతో కలిసి ఉద్ధృతంగా ప్రచారం చేస్తుండగా.. మహిళలు హారతులతో వారికి స్వాగతం పలికారు.
నగరంలో తెదేపా అధికారంలోకి వస్తే.. ప్రజలపై పన్నుల భారం పడకుండా అభివృద్ధి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వస్తే.. ప్రజల నడ్డి విరిచే రీతిలో ఆస్తి విలువ ఆధారంగా పనుల భారం పడబోతోందని ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు ఓటర్లను హెచ్చరించారు.