నగరపోరుకు మూడు రోజుల పాటు సాగిన నామపత్రాల స్వీకరణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. కృష్ణా జిల్లాలో ఎన్నికలు నిర్వహిస్తున్న నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు భారీ సంఖ్యలో నామపత్రాలు సమర్పించారు. మొదటి, రెండో రోజున నామమాత్రపు స్పందన కన్పించినా శుక్రవారం అన్ని చోట్ల అభ్యర్థులు పెద్ద ఎత్తున నామపత్రాలు సమర్పించారు.
సాంకేతిక కారణాలతో ఎన్నికలు వాయిదా పడిన గుడివాడ, జగ్గయ్యపేట పురపాలక సంఘాలను మినహాయిస్తే విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు పెడన, నూజివీడు, పురపాలక సంఘాలు, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీల్లో అన్ని ప్రధాన పక్షాలకు చెందిన అభ్యర్థులు బరిలో నిలిచేందుకు సంసిద్ధులయ్యారు. నూజివీడు పురపాలక సంఘంలో కాంగ్రెస్ తరఫున ఎవ్వరూ దరఖాస్తు చేసుకోలేదు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 64 డివిజన్లకు బుధవారం 18, గురువారం 150 మంది నామపత్రాలు దాఖలు చేయగా శుక్రవారం 633 మంది నామపత్రాలు అందజేశారు. విజయవాడ కార్పొరేషన్‌తోపాటు జిల్లాలో మిగిలిన స్థానాలకు మొత్తం మీద 1719 నామపత్రాలు అందాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భవానిపురంలో ఇరు పక్షాలకు చెందిన కార్యకర్తల నడుమ వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి.