ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ పేరిట యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.ప్రతి ఏటా జాబ్ కేలండర్, మెగా డీఎస్సీలు ఎక్కడికి పోయాయని ధ్వజమెత్తారు. ఒకసారి 4.77 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటన ఇచ్చారన్నారు. 20 రోజుల తర్వాత 6.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారని అన్నారు. 20 రోజుల్లోనే దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. పోలీస్ శాఖలో 7 వేల ఖాళీలుంటే 450 భర్తీ చేస్తామనడం నిరుద్యోగులను మోసగించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూప్-1, గ్రూప్-2లో 30 వేలకు పైగా ఖాళీలుంటే 36 మాత్రమే భర్తీ చేస్తామనడం వంచించడమే అవుతుందని అన్నారు. ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్ ఉపసంహరించుకోవాలని కోరారు.