తెదేపా నేతలు చిల్లర రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు హితవు పలికారు. తమ రాజకీయ మనుగడను కాపాడుకోవాలనే స్వార్థంతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు.. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజకీయ మేధావులు సైతం స్వాగతించారని గుర్తు చేశారు.
అక్రమ సంపాదనను రాజధాని ముసుగులో పెట్టడం....రైతుల వద్ద నుంచి అవసరం లేకున్నా బలవంతంగా భూములు లాక్కుని తమ రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా తెదేపా నేతలు మార్చుకున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే తెదేపా ఉద్యమాలు చేస్తుందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎంపీ అన్నారు. ఏ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడితే అభివృద్ధిలో ముందుంటామనే అంశాలపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. అన్ని రంగాలతో పాటు రాష్ట్రంలో వైద్య సేవలను పెంచేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వైద్య కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా తెదేపా నాయకులు కళ్లు తెరచి...ఆరోపణలు ఆపి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.