కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సవ్యంగా జరిగేలా చూడాలని పోలీసులకు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని (Kesineni nani On Kondapalli Municipal Chairman elections) విజ్ఞప్తి చేశారు. నిన్నటి పరిణామాలకు సంబంధించి వైకాపా సభ్యులపై క్రిమినల్ కేసు పెట్టాలని ఆర్‌వోను డిమాండ్ చేశారు. కొండపల్లి పురపాలక సంఘం నుంచి తెదేపా కౌన్సిలర్లతో పాటు బయటకు వచ్చిన ఆయన.. ఛైర్మన్ ఎన్నిక కోసం ఇప్పటివరకు వేచి చూశామన్నారు. రేపు ఛైర్మన్ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశాలిచ్చినందున..ఎన్నిక సవ్యంగా జరిగేలా చూడాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
"కోర్టు ఆదేశాలు మరిచి అధికారులు ఎన్నిక వాయిదా వేశారు. తొలిరోజు భేటీ వాయిదా వేయడమే తప్పు. రెండోరోజు కూడా సమావేశం వాయిదా వేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు ప్రలోభ పెడుతున్నారు. పార్టీకి కట్టుబడి ఉంటామన్న నేతలకు ధన్యవాదాలు. తెదేపా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోవట్లేదు. రేపు ఎన్నిక సవ్యంగా జరిగేలా పోలీసులు చూడాలి. నిన్నటి పరిణామాలపై వైకాపా సభ్యులపై ఆర్‌వో క్రిమినల్ కేసు పెట్టాలి."-కేశినేని నాని, తెదేపా ఎంపీ
రేపు ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశం