పోస్కో సంస్థతో చీకటి ఒప్పందంలో భాగంగానే అమరావతిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అటకెక్కించారని విజయవాడ ఎంపీ కేశినేని నాని ధ్వజమెత్తారు. ఇప్పుడు కుట్ర బయటపడేసరికి విశాఖను అటకెక్కించేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కేశినేని నాని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి పర్యటించారు. విజయవాడను ముఖ్యమంత్రి జగన్ ఎంత వెనక్కి తీసుకెళ్దామనుకున్నా.. అంతకంటే ఎక్కువగా ముందుకు తీసుకెళ్లి చూపిస్తామని సవాల్ చేశారు.
విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని రేషన్ కార్డులు తొలగించటమేంటని ఆక్షేపించారు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు నొప్పి తెలుస్తోందనీ.. రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి గట్టి బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్రంలో 10 శాతం రేషన్ కార్డులు కూడా మిగలవని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. 12ఏళ్లుగా విజయవాడ నగరంలో లేని దాడుల సంస్కృతిని మళ్లీ తీసుకొచ్చారని, దీనిని నగర ప్రజలు ఆమోదించరని తేల్చి చెప్పారు.