వైకాపా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను చూసి.. తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో తెలుగుదేశం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొంటోందని ఎంపీ బాలశౌరి ఆరోపించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ బాలశౌరి.. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుతో కలసి పాల్గొన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటినుంచి పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని చెప్పారు. ఇది ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ కుట్రలకు తెర తీసిందని ఆరోపించారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ... ఆంగ్ల మాధ్యమం విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాల కారణంగా పేదవారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గూడు లేని ప్రతీ పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేయాలని కోట్లాది రూపాయలు వెచ్చించి భూమి కొనుగోలు చేసి ప్లాట్లు విడగొడితే... తెలుగుదేశం నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు.