ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వాహనదారుల ఇక్కట్లు.. - కృష్ణాజిల్లా ప్రధానాంశాలు

వాహనాలు విజయవాడలోకి ప్రవేశించేందుకు వారధి కూడలి ప్రధానమైనది. ఈ రహదారి బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రాత్రి 10 గంటలు దాటితే వాహనాల రద్దీతో ఆ ప్రాంతం భయానకంగా మారుతోంది. హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు చేరిన లారీలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రద్దీతో ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందోనని బెంబేలెత్తుతున్నారు

నిలిచిన వాహనాలు
నిలిచిన వాహనాలు

By

Published : Dec 6, 2020, 8:19 AM IST

గుంటూరు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలు విజయవాడలోకి వెళ్లకుండా..... బెంజి సర్కిల్‌, రామవరప్పాడు మీదుగా ఇన్నర్‌రింగ్‌ రోడ్డు ద్వారా గొల్లపూడి వద్ద జాతీయరహదారి పైకి చేరుకుంటాయి. ట్రాఫిక్‌ రద్దీ తగ్గించేందుకు అక్టోబర్‌ 16న కనకదుర్గ పైవంతెన ప్రారంభించారు. దీంతో గుంటూరు నుంచి వచ్చే వాహనాలకు ఈ మార్గం అనువుగా మారింది.

విజయవాడలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు

నగరవాసుల భద్రత దృష్ట్యా... ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ నగరంలోకి లారీలను అనుమతించడం లేదు. ఫలితంగా గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నుంచి వచ్చే లారీల డ్రైవర్లు..... రాత్రి 11 గంటలకు అక్కడకు చేరుకునేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు మొత్తం గుంతలు పడి ప్రమాదకరంగా మారడంతో.... విశాఖ వైపు వెళ్లే వాహనదారులు కూడా ఇటువైపు నుంచి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రాత్రి 10 గంటల నుంచే లారీలు వారధి కూడలికి చేరుకుంటున్నాయి. 11 గంటల వరకు అనుమతించేది లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో.... రోడ్డుపైనే ఇష్టానుసారం నిలిపివేస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ విపరీతంగా నిలిచిపోతోంది. ఇంతపెద్ద ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అక్కడ ఒక్క కానిస్టేబుల్‌ మాత్రమే విధుల్లో ఉంటున్నారు.

లారీలను వెనక్కి పంపించడం, అత్యవసర వాహనాలకు దారి ఇప్పించడం, నిబంధనలు పాటించని వాహనాలను గుర్తించడం వంటి పనులతో.....అతనికి తలకుమించిన భారంగా మారుతోంది. రాత్రి 11 గంటల తర్వాత లారీలు భారీగా అక్కడకు చేరుకుంటున్నాయి. దీంతో దాదాపు అరగంట సేపు ట్రాఫిక్ నిలిచిపోతోంది. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్‌ సిబ్బందినైనా పెంచాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి

ప్రభుత్వ సర్వే: మీ ఇంట్లో ఎవరు ఎంత చదువుకున్నారు?

ABOUT THE AUTHOR

...view details