కృష్ణా జిల్లా బందరు ప్రధాన రహదారి పోలీస్ షాపింగ్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఓ లేగదూడని ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న తన బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక తల్లి ఆవు విలవిలాడిపోయింది. స్థానికులు పశు వైద్యుడిని అక్కడకు తీసుకొచ్చారు. ఆ తువ్వాయిని పరిశీలించిన వైద్యుడు దూడ చనిపోయిందని నిర్ధరించాడు. విగతజీవిగా మారిన తన దూడ బతుకుతుందేమోనని గంపెడు ఆశతో గోమాత ఎటూ వెళ్లకుండా అక్కడే కూర్చొని మూగగా రోదించిన దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. నోరులేని జీవాలను నిర్లక్ష్యంగా రహదారిపై వదిలేసి వాటి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు.
దేవుడా.. నా బిడ్డను బతికించు.. - దూడ కోసం తల్లి ఆవు రోదన
అమ్మతనానికి మనిషి, పశువు అనే తేడా ఉండదు. కడుపుకోత ఎవరికైనా ఒకటే. బిడ్డ చనిపోతే తల్లి పడే బాధ ఏ జీవిలోనైనా ఒకేలా ఉంటుంది. ఇలాగే... తన దూడ మృతి చెందిన విషయం తెలిసినా.. మళ్లీ బతికివస్తుందేమో అనే చిన్ని ఆశతో తల్లి ఆవు రోదన అందరినీ కంటతడి పెట్టించింది.

లేగ దూడ మృతి.. తల్లి ఆవు మూగ రోదన
Last Updated : Oct 30, 2019, 12:41 PM IST