Modernization of Budameru Canal: విజయవాడలో వ్యర్థ జలాల ప్రవాహంతో పాటు.. వరదల సమయంలో పైనుంచి వచ్చే నీటిని దిగువకు పంపేందుకు బుడమేరు కాలువ రూపుదిద్దుకుంది. నీటిపారుదల శాఖలో ప్రత్యేక విభాగం కింద ఉన్న ఈ కాలువ నీటితో గతంలో సమీపంలోని పొలాల్లో కొంత భాగం సాగయ్యేవి. కానీ ప్రస్తుతం కాలువ పరివాహక ప్రదేశంలో ముక్కు మూసుకోకుండా నడవలేని పరిస్థితి నెలకొంది. బుడమేరు కాలువ విజయవాడ పరిధిలో 11 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది.
ఎక్కువ భాగం సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో సుమారు 7 కిలోమీటర్ల మేర ఉంది. నగరంలోని చనుమోలు వెంకట్రావు పైవంతెన కింద నుంచి.. జక్కంపూడి కాలనీ, వైవీ రావు ఎస్టేట్ వద్ద నుంచి.. గుణదల శివారు వరకు విస్తరించి ఉన్న ఈ కాలువ ప్రస్తుతం వ్యర్థజలాలతో నిండిపోయింది. మాంసపు వ్యర్థాలనూ కాలువలోనే పారవేస్తుండటంతో.. క్యాట్ ఫిష్‌లు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. కాలువలో నాలుగేళ్లుగా పూడిక తీయకపోవడంతో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి.. దోమలు స్త్వైరవిహారం చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బుడమేరు కాలువ ఆధునికీకరణ, శుభ్రం చేసేందుకు.. ప్రతిపాదనలు రెండు దశాబ్దాలుగా పెండింగులోనే ఉన్నాయి. కాలువ గురించి పట్టించుకునేవారు లేకపోవడంతో.. పరివాహక ప్రాంతం ఆక్రమణకు గురవుతోంది. ఈ తరుణంలో.. ఇటీవల కాలువకు ఇరువైపులా రివిట్‌మెంట్ వాల్ నిర్మించి.. శుభ్రం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు.. నగరపాలక సంస్థ అధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా.. అవి ఆచరణకు ఆమడదూరంలోనే నిలిచాయి.