వైకాపా ప్రభుత్వంలో మంత్రులు రైతులు, ప్రజా సమస్యలు కాకుండా ప్రతిపక్షంపై వ్యక్తిగత దూషణలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కృష్ణాజిల్లా గుడివాడలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. ఒక మంత్రి హోదాలో ఉన్న కొడాలి నాని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని లారీలతో తోక్కిస్తాను అనడం ఎంతవరకు సబబు అని అన్నారు. నాని ఆత్మపరిశీలన చేసుకోవాలని... ఇప్పటికైనా మంచి ప్రవర్తనతో రాష్ట్రానికి, కృష్ణా జిల్లాకు మంత్రిగా మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు.
ముదినేపల్లి మండలం ఐనంపూడిలో ఎస్సీ కుటుంబం ఇల్లు తగలబెట్టిన ఘటనలో బాధ్యులను అరెస్టు చేయాలని బచ్చుల అర్జునుడు డిమాండ్ చేశారు. సోమవారం తెదేపా ఆధ్వర్యంలో ఛలో ఐనంపూడి కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా బాధ్యులపై చర్యలు తీసుకోకపోవటంతో నిందితులను ప్రభుత్వం కాపాడుతుందని అరోపించారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఆర్థిక సాయం, పక్క గృహంతో పాటు.. బాధిత మహిళకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.