కనిపించని శత్రువుతో పోరాటం కష్టమని పేర్కొంటూ... రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నట్లుగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మరో లేఖ రాశారు. గుంపులో నల్లగొర్రెలు గుర్తించడం కష్టతరమని పేర్కొన్న ఆయన విషయాన్ని ఇంకా పొడిగించి భిన్నాభిప్రాయాలకు తావివ్వటం ఇష్టం లేదని తెలిపారు. తన కోసం విలువైన సమయం కేటాయించి... పూర్తి మద్దతుగా నిలిచినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలిసో తెలియకో ఎక్కడైనా పరిధి దాటి ప్రవర్తించి ఉంటే మన్నించాలని కోరారు. తన ఆవేదన అర్ధం చేసుకుని తనకు లేఖ రాసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రతి అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నానని...13ఏళ్ల నుంచి అధినేత ఆదేశాలు పాటిస్తూ పార్టీకి చిత్తశుద్ధితో పని చేసినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు ఆదేశాలనుసారం తొలిసారి విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్లు విలువైన సమయం వృథా అయిందని ఏనాడూ బాధపడలేదనిఆ తర్వాత ఒక సీనియర్ నాయకుడుపైనా ఐపీఎస్ అధికారిపైనా, ఇలా ఎన్నోసార్లు తన పోరాటం కొనసాగిందన్నారు.అప్రజాస్వామిక విధానాలపై తన పోరాటం ఎప్పుడూ ఆపలేదన్నారు.2019 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు ప్రత్యర్ధులు తనపై ఎలాంటి ఒత్తిడి తెచ్చారో చంద్రబాబుకు తెలియనిది కాదన్నారు.
'కనిపించని శత్రువుతో పోరాటం కష్టం- తప్పదు తప్పుకొంటున్నా'
చంద్రబాబు ప్రత్యుత్తరానికి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. తన ఆవేదన అర్థం చేసుకుని లేఖ రాసినందుకు కృతజ్ఞతలంటూ పేర్కొన్నారు.
Last Updated : Oct 28, 2019, 9:09 AM IST