కృష్ణాజిల్లా గన్నవరం రాజకీయం వేడెక్కుతోంది. త్వరలోనే వైకాపాలో చేరతారనే వార్త ప్రచారం జరుగుతున్న వేళ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ట్విస్ట్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు చంద్రబాబుకు లేఖ రాశారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు అందులో పేర్కొన్నారు.
వేరే మార్గం లేదు...
ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక తనను, తన అనుచరులను స్థానిక వైకాపా నేతలు, కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని లేఖలో వెల్లడించారు. ఈ విషయం తనను కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచర వర్గాన్ని కాపాడుకునేందుకు ఇంతకన్నా వేరే మార్గం లేదని లేఖలో స్పష్టం చేశారు.
వైకాపాలో చెరతారనే ప్రచారం...
ఇటీవల మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి తాడేపల్లిలో సీఎం జగన్‌తో వంశీ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో వంశీ వైకాపాలో చేరతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే పార్టీ మారే ఉద్దేశమే ఉంటే స్థానిక వైకాపా నేతలు, అధికారులపై ఎందుకు ఆరోపణలు చేశారనే కోణంలో కొత్త ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. పార్టీ మార్పు అనే అంశం పక్కన పడిపోయి రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు వంశీ చెప్పటంతో గన్నవరం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.