కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు రైతులు అధైర్య పడవద్దని, అన్ని విధాల ఆదుకునే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనకున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. తుపాను వల్ల పంట దెబ్బతినడం, అప్పుల బాధ తాళలేక ఈ నెల 2వ తేదీన కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ మండల పరిధిలోని కొత్తపేటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ముళ్లపూడి వెంకట కృష్ణయ్య (తాతయ్య) కుటుంబానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, ఆర్డీవో ఖాజావలి రూ.ఏడు లక్షల చెక్కును ఆదివారం అందజేశారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సూదాని సాంబశివరావు బాధిత కుటుంబానికి రూ.ఏడు లక్షల చెక్కును మృతుని భార్య వెంకట రమణకు అందచేశారు.
"కష్టాలు వచ్చినప్పుడు రైతులు ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు. దీనివల్ల కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయి మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే నెలరోజుల్లోపే ఆత్మహత్య చేసుకున్న తాతయ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.7 లక్షలు పరిహారం అందజేశారు. తుపాను వల్ల పంట దెబ్బతిన్న రైతులకు త్వరలోనే పరిహారం అందించేందుకు సీఎం చర్యలు చేపట్టారు". :ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు