MLA Kotam reddy : ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ దళారీగా వ్యవహరిస్తున్న సీతారామాంజనేయులుకు ఉద్యోగులను, ఎమ్మెల్యేలను వేధించడం తప్ప ఇంకేం పని లేదు అని కోటంరెడ్డి మండిపడ్డారు. ఉండవల్లి అరుణ్ చేత ఢిల్లీలో మాట్లాడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని... ఈనాడు, మార్గదర్శి, రామోజీరావుపై ఉండవల్లి చేత ఇవాళ గానీ, రేపు గానీ మాట్లాడించబోతున్నాడని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల మాటలు ఢిల్లీ నాయకత్వం వినడం లేదని.. ఉండవల్లిని ట్రాప్ చేసి ఢిల్లీకి పంపిస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు.
ఉండవల్లి గారూ.. ట్రాప్‌లో పడొద్దు.. 20 ఏళ్లుగా ఉండవల్లికి నేను ఏకలవ్య శిష్యుడిని అని చెప్పుకొన్న కోటంరెడ్డి.. "ఉండవల్లి గారూ మీకు మంచి గౌరవం ఉంది.. మీరు వైఎస్సార్సీపీ ట్రాప్‌లో పడొద్దు.. సీతారామాంజనేయులు మిమ్మల్ని ట్రాప్ చేస్తున్నారు.. రామోజీరావుని వేధిస్తే ఆయన మీకు లొంగుతాడని అనుకోవడం అవివేకం" అని తెలిపారు. సాక్షి ఛానెల్‌కి నన్ను పిలవండి.. చర్చ పెట్టండి... ఈనాడు గురించి, రామోజీరావు గురించి మాట్లాడుతా అని అన్నారు. మార్గదర్శిపై మీరు ఇంతలా వేధింపులకు గురి చేస్తున్నారు.. ఒక్కరన్నా బాధితులు మీకు ఫిర్యాదు చేశారా..? అని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఒక్కరన్నా మార్గదర్శి కార్యాలయం వద్దకి వెళ్లి తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారా..? సీతారామాంజనేయులు ఉలిక్కిపడకండి...? మీ రహస్య ప్రణాళిక నాకు ఎలా తెలిసిందో అని భయపడొద్దు అని కోటంరెడ్డి అన్నారు. మీకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఉంటే... నాకు మీ దగ్గరే నెట్ వర్క్ ఉంది.. నాకు సెక్యూరిటీ తగ్గించావ్, అనేకమందిని వేధింపులకు గురిచేశావ్.. మీ బాగోతం మరో ఆరు నెలల్లో ముగుస్తుంది... మీ ఆటలు ఇక సాగవు అని ఎమ్మెల్యే కోటం రెడ్డి పేర్కొన్నారు.