ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిర్చి పైరుకు తెగుళ్లు... ఆందోళనలో అన్నదాతలు - మిర్చి పైరుకు తెగుళ్లు

గత నెలలో కురిసిన భారీ వర్షాలు మిర్చి రైతులను నిండా ముంచాయి. నిర్విరామంగా కురిసిన వర్షాలకు భూమిలో తేమ శాతం పెరగడం వల్ల మిర్చి పైరుకు తెగుళ్లు సోకింది. దీంతో కృష్ణా జిల్లా రైతులు.. పంట సాగుకు అర్థిక భారం మోయలేక పైరును తొలగిస్తున్నారు.

mirchi crop damaged in krishna
మిర్చి పైరుకు తెగుళ్లు... ఆందోళనలో అన్నదాతలు

By

Published : Nov 8, 2020, 5:14 PM IST

ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోవడం వల్ల అన్నదాతకు తీరని నష్టం వాటిల్లింది. అధిక వర్షపాతం వల్ల కృష్ణా జిల్లాలో మిర్చి పైరుకు తెగుళ్లు సోకింది. దీంతో సాగులో ఉన్న పైరును అన్నదాతలు తొలగిస్తున్నారు. జిల్లాలోనే మిర్చిని అత్యధికంగా పండించే ప్రాంతాలైనా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో సుమారు 30 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

పెరిగిన సాగు విస్తీర్ణం...

గత ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండటం వల్ల ఈ ఏడాది మిర్చి పంట సాగు విస్తీర్ణాన్ని పెంచారు. సెప్టెంబరు, అక్టోబర్ నెలల్లో పంటపై విస్తృతంగా పెట్టుబడి పెట్టారు. అయితే పూత, పిందె పడే దశలో ఉండగా గత నెలలో అధికశాతం వర్షపాతం నమోదయింది. దీంతో వాతావరణ మార్పులు భారీగా చోటు చేసుకోవడం వల్ల విపరీతంగా తెగుళ్లు వ్యాప్తి చెందాయి.

బొబ్బ తెగులు..

జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో బొబ్బ తెగులుగా పిలుచుకునే వైరస్ వ్యాపించటం వల్ల మొక్కలు పెరుగుదల లోపించింది. తెగుళ్లను గుర్తించిన రైతులు మొక్కలు పీకేసి నర్సరీ నుంచి కొత్త మొక్కలు తీసుకొచ్చి నాటారు. అలా రెండు నుంచి మూడు సార్లు నర్సరీ మొక్కలు నాటు కోవాల్సి రావటం వల్ల రైతులపై అధిక పెట్టుబడుల భారం పెరిగింది.

అధిక తేమతో...

పెనుగంచిప్రోలు, చందర్లపాడు, నందిగామ మండలాల్లో సాగుచేసిన మిర్చి పంటలో అధిక తేమ వల్ల వేరు కుళ్లుడు వచ్చింది. దీనివల్ల పైరు ఎండిపోతున్న తరుణంలో రైతులు మొక్కలు పీకేసి కొత్త మొక్కలు నాటుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఎకరానికి రూ. 60 నుంచి 90 వేల వరకు ఖర్చు చేశామని.. అయినా ఫలితం లేకపోయిందని రైతులు వాపోతున్నారు. మళ్లీ కొత్తగా మొక్కలు నాటుకోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సరీ మొక్కలు కొనుగోళ్లకు సగం పెట్టుబడి అవుతుందని చెబుతున్నారు. మొదట్లో రూ. 80 పైసలకు విక్రయించిన మొక్క.. ప్రస్తుతం రెండు నుంచి మూడు రూపాయల వరకు పెంచారని చెబుతున్నారు. మొత్తంగా ఈ ఏడాది అధిక వర్షాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్న వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించటానికే మీటర్లు- ఆళ్ల నాని

ABOUT THE AUTHOR

...view details