గ్రామ, వార్డు సచివాలయాల్లో మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్, పాన్ కార్డ్ వంటి సేవలను అందించనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ సీఎం జగన్ మానసపుత్రికలని, ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. వీటి ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించగలుగుతున్నట్లు తెలిపారు. కానీ కొంత మంది కావాలనే.. గ్రామ, వార్డ్ సచివాలయాల ఉద్యోగులను ప్రొబేషన్ విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.
ప్రొబేషన్ విషయంలో ఎటువంటి రాజకీయాలు ఉండవని, ఏపీపీఎస్సీ ద్వారా డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఆగస్టులో మెుదటి దఫా, సెప్టెంబర్లో రెండో దఫా డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 35 శాతం మందికి పరీక్షలు నిర్వహించినట్లు పెద్దిరెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలకి వచ్చే ఫిర్యాదులలో పరిష్కారమైనవి, తిరస్కరించినవి వేర్వేరుగా చూపాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. సచివాలయాలను సందర్శించాల్సిందిగా కలెక్టర్లు, జేసీలు, సబ్ కలెక్టర్లను సీఎం ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. త్వరలోనే మంత్రులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల సందర్శనకు వెళ్లనున్నట్లు వివరించారు. మరోవైపు పరీక్షలపై సచివాలయ ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ప్రతి నెలాఖరి శుక్ర, శని వారాల్లో సచివాలయ సిబ్బంది ప్రతి గృహాన్ని సందర్శిస్తారని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందిస్తారని మంత్రి తెలిపారు.