గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జల్‌శక్తి అభియాన్ కింద చేపట్టే కార్యక్రమాలకు ఉపాధి హామీ, వాటర్‌షెడ్, వ్యవసాయశాఖ, అటవీశాఖ, కాడా, ఎస్‌బీఎం, జల్‌జీవన్ మిషన్, పదిహేనో ఆర్థిక సంఘం, సీఎస్‌ఆర్ నిధులను కేటాయిస్తామని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ అన్నారు. జలసంరక్షణపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పాల్గొన్నారు. అవసరమైన చోట్ల కొత్త చెక్ డ్యాంల నిర్మాణం, భూగర్భ జలాలను రీఛార్జ్ అయ్యేలా చూడటం, వర్షాకాలంలో కురిసే నీటిని జలవనరుల వైపు మళ్లించి భవిష్యత్ అవసరాలకు వీలుగా సంరక్షించుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల రూఫ్ వాటర్‌ను భూమిలోకి ఇంకేలా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, అర్బన్ ప్రాంతాల్లోని ప్రైవేటు నిర్మాణాలు కూడా ఈ చర్యలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. పదమూడు జిల్లాల్లోని 661 బ్లాక్‌లలో మండల, పంచాయతీల స్థాయి, పట్టణాల్లో మున్సిపల్ స్థాయి బృందాలను ఏర్పాటు చేసి అత్యంత నీటి సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో జల్‌శక్తి అభియాన్ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు.