కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో అన్ని దేవాలయాలను త్వరలో తెరిచేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. విజయవాడలోని దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్, ఆర్జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం ఆదేశాల అనంతరం దేవాలయాలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తులు సంతృప్తికరంగా బయటకెళ్లేలా తగిన సేవలు, దర్శనం అందేలా చూడాలని మంత్రి వెల్లంపల్లి సూచించారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చారని చెప్పారు. దేవాలయ భూములు కాపాడుకునే విషయంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.