రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలను భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించడంపై వైకాపా మండిపడింది. విగ్రహాల కూల్చివేతపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ మాట్లాడటం శోచనీయమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని అవమానించేలా, మచ్చ పడేలా ఎంపీ మాట్లాడారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రయోజనం కల్గించేలా నిధులు తీసుకురావడం సహా పోలవరం, విభజన హామీల అమలు తదితర సమస్యలపై రాజ్యసభలో జీవీఎల్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. అంతర్వేది రథం దగ్ధం ఘటనను సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఇప్పటి వరకు కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదో స్పష్టం చేయాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. దీనిపై రాజ్యసభలో జీవీఎల్ ఎందుకు ప్రశ్నించరని.. దీనికి ఆయన సమాధానం చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో 40 దేవాలయాలను కూల్చారని అప్పుడు భాజపా నేత మాణిక్యాల రావు దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారన్న సంగతి గుర్తించాలన్నారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం కేసుల్లో భాజపా నేతలు కూడా ఉన్నారన్నారు. ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని సిట్ త్వరలో తేల్చుతుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని భాజపా ప్రయత్నిస్తుందని మంత్రి వెల్లంపల్లి మండిపడ్డారు. సిట్ నివేదికలో ఒక్కో విషయాన్ని బయటపెడుతుంటే తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారన్నారు.
'విగ్రహాల ధ్వంసం కేసుల్లో భాజపా నేతలూ ఉన్నారు' - అంతర్వేధి రథం ఘటన తాజా వార్తలు
అంతర్వేది ఘటన సీబీఐకి అప్పగిస్తూ కేంద్రానికి లేఖ రాశామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సీబీఐ విచారణకు కేంద్రం ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో భాజపా నేతలూ ఉన్నారని పేర్కొన్నారు.

విగ్రహాల ధ్వంసంపై మాట్లాడుతున్న మంత్రి వెల్లంపల్లి
Last Updated : Feb 3, 2021, 8:38 PM IST