రవాణాశాఖ ఆదాయం పెంచేందుకు పేదలపై ప్రతాపం చూపొద్దని మంత్రి పేర్ని నాని అధికారులకు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే పెద్దవాళ్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 4 వేల పాఠశాల బస్సులు ఫిట్‌నెస్ లేకుండా తిరుగుతున్నాయన్న మంత్రి... ఫిట్‌నెస్ లేని బస్సుల్లో బడికి పంపొద్దని బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు ఎవరైనా లంచాలు తీసుకుంటే కఠినచర్యలు తప్పవని పేర్ని నాని హెచ్చరించారు.
ప్రమాదాలు తగ్గించాలి...
రహదారులపై కొందరు నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్నారని... కొందరి నిర్లక్ష్యం కారణంగా అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని మంత్రి పేర్ని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటోడ్రైవర్లు ఎక్కువగా రహదారి నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలు తగ్గించేందుకు రవాణాశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. రవాణాశాఖ ఉద్యోగుల సమస్యలు తీర్చేందుకు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు.