కృష్ణా జిల్లాలో వరద పరిస్థితులు, నష్టాలపై ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వరద తగ్గిన తరువాత కరకట్టకు దిగువన ఉన్నవారిని ఇతర ప్రాంతాల్లోకి తరలించాలని మంత్రి సూచించారు. నది లోపల ఉన్న వారిని ఇతర ప్రాంతాల్లో తరలించకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంటుందన్నారు.
వరదల కారణంగా సంభవించిన పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. వరదల్లో ఇళ్లు ధ్వంసమైన వారికి పక్కా ఇళ్ళను మంజూరు చేయాలన్నారు. కృష్ణా నదికి ఎన్నడూ లేని విధంగా ఇరవై ఏళ్ళ తరువాత 1005 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ నుంచి కిందికి వదలినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 34 మండలాలను వరద ప్రభావితం చేసిందని... 18 నదీ తీర మండలాల్లో 47,943 మంది ఇబ్బందులు పడ్డారన్నారు.