Minister Merugu Nagarjuna on TDP Manifesto: మంత్రి మేరుగు నాగార్జున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. మహానాడు వేదికగా టీడీపీప్రకటించిన ఎన్నికల హామీలపై మంత్రి విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. మహానాడులో ప్రకటించిన పథకాలన్నీ అమలు చేయగలరా అని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఏం చేయాలో వారికి తెలుసు అని పేర్కొన్నారు.
ఎన్నికల సన్నద్ధతలో టీడీపీ కీలక ముందడుగు మహిళా సాధికారతకు మహాశక్తి
పేదలు ఇళ్లు కట్టుకునేందుకు సెంటు భూమి ఇస్తే తట్టుకోలేని వ్యక్తి ఇప్పుడు సంక్షేమ పథకాలను ఇస్తారా అని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. ఎన్టీఆర్కు రెండు రూపాయల కిలో బియ్యం, వైయస్కు ఆరోగ్య శ్రీ లాంటి పేటెంట్ పథకాలు ఉన్నాయని గుర్తు చేస్తూ.. మరి చంద్రబాబుకు అలాంటి పేటెంట్ పథకాలు ఏమైనా ఉన్నాయా అంటూ నిలదీశారు. ప్రజలకు ఏమీ గుర్తు ఉండదు, అన్ని మర్చిపోతారు... అన్న ఫిలాసఫీతో మహానాడులో మేనిఫెస్టోప్రకటించారని విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 98 శాతం మేనిఫెస్టో అమలు చేసిందని, మహానాడులో ప్రకటించిన అన్నీ హామీలు అమలు చేయగలరా అని మేరుగు నాగార్జున ప్రశ్నించారు. పూర్ టూ రిచ్ పథకం అంటే ఏమిటని అన్నారు. తాము తప్పిదాలు చేసినా ప్రజలు గమనిస్తారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 2.10 లక్షల కోట్ల డీబీటీలో ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో నాలుగు రోజుల తర్వాత ఎక్కడ ఉంటుందో తెలియదని విమర్శించారు. ఇళ్ల పట్టాలుఇచ్చిన 17 వేల కాలనీలు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు.