Kottu Satyanarayana on Durga Temple Issue: కర్నాటి రాంబాబు తీరుపై కొట్టు కౌంటర్.. దుర్గగుడి పంచాయితీకి తెరపడేనా..? Minister Kottu Satyanarayana: దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు ఇటీవల ఆలయ ఈవో భ్రమరాంబపై తీవ్ర వ్యాఖ్యలు చేయడమే కాకుండా ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసిన తరుణంలో మీడియా అడిగిన ప్రశ్నకు కొట్టు సత్యనారాయణ స్పందించారు. అవినీతిపరంగా దేవాదాయశాఖకు ఓ ముద్ర ఉందని.. అనేక సంస్కరణలతో ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఈ శాఖలో ఉద్యోగులుగా పని చేస్తున్న కొందరు అక్రమ సంపాదన, అవినీతికి అలవాటుపడ్డారని.. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అవినీతి నిరోధకశాఖ తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరుపుతూ.. సోదాలు నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగానే ఇంద్రకీలాద్రిపై సూపరింటెండెంట్‌గా పనిచేస్తోన్న వాసా నగేష్‌పై కేసు నమోదు చేసిందని.. అతనిపై ఆలయ ఈవో సస్పెన్షన్ వేటు వేశారన్నారు.
నగేష్ గతంలో చేసిన పొరపాట్లకు జీతంలో ఇప్పటికీ కోత పడుతోందని చెప్పారు. దుర్గగుడి ఈవో సమర్ధవంతంగా.. ఎక్కడా అవినీతికి తావులేకుండా తమ విధులు నిర్వహిస్తూ వెళ్తున్నారని చెప్పారు. కింది ఉద్యోగులు చేసిన తప్పులన్నింటికీ ఈవోను బాధ్యులను చేయలేమని.. కానీ శాఖాపరంగా చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేయబోమన్నారు.
ఈవోకు వ్యతిరేకంగా విమర్శలు చేసిన వాళ్లు.. ఏ స్థాయిలో ఉన్నారనేది ఆలోచన చేసుకోవాలని.. పొరపాట్లు చోటు చేసుకుంటుంటే అవి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అలా కాకుండా తాము చెప్పిన పనులు అమలు చేయడం లేదని.. తమ ఆధిపత్యం కొనసాగడం లేదనే ఆలోచన చేయడం ఎవరికీ మంచిదికాదని హితవు పలికారు.
ఈ తరహా ఆరోపణలు ఎవరూ చేయకూడదన్నారు. భక్తులకు సేవలు అందించడంలో శాఖాపరంగా అలసత్వం లేకుండా చూసేందుకు ఆన్‌లైన్ సేవలు, ఆన్‌లైన్ టిక్కెటింగ్, ఆన్‌లైన్ అకామిడేషన్, ఆన్‌లైన్ ప్రసాదాల ఇలా అన్నింటినీ ఆన్‌లైన్ చేశామని తెలిపారు. ఈవోలు ఇష్టానుసారం వ్యవహరించకుండా చూసేందుకు ప్రీఆడిట్ విధానాన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా దేవాదాయశాఖలోనే అమలు చేస్తున్నామన్నారు.
అధికారులు కొందరు చేతివాటానికి అలవాటుపడిన విషయం తమ దృష్టిలో ఉందని.. వాటిని బయటకు తీసుకొస్తున్నామన్నారు. ఐదేళ్లు దాటిన వారికి ఇటీవల స్థానచలనం కలిపించామని.. దేవాదాయశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 865 మందిని ఒకేసారి బదిలీలు చేశామని చెప్పారు. తద్వారా వారు చేసిన లొసుగులు బయటపడుతున్నాయన్నారు. అలాంటి వారిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రతి ఆలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు ఆర్ధికపరమైన విధుల్లో ఉన్న వారిని ప్రతి మూడు నెలలకు ఓసారి మార్పులు చేయాలని ఆదేశించామని.. తద్వారా చేతివాటానికి అలవాటుపడకుండా నియంత్రించొచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. దేవాదాయశాఖ మంత్రిగా తన దృష్టికి తీసుకురాకుండా నేరుగా సీఎంకు ఫిర్యాదు చేయడం వెనుక.. పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబుకు.. అనుభవరాహిత్యమో.. తెలియని తనమో అయి ఉండొచ్చని అన్నారు.
ముఖ్యమంత్రి వద్దకు వెళ్లినా.. దర్యాప్తు చేయాలని తిరిగి తనకు కాగితం పంపిస్తారని.. ఖచ్చితంగా దర్యాప్తు చేస్తామన్నారు. దుర్గగుడికి పాలకమండలిని కొత్తగా వేశామని.. వ్యవస్థలో జరుగుతున్న కార్యక్రమాల గురించి అర్ధం చేసుకోవడానికి సమయం పడుతుందన్నారు. పాలకమండలి ఉత్సాహమో.. అత్యుత్సాహమో కారణంగానే విమర్శలు చేసి ఉంటారని.. అంతమాత్రాన ఛైర్మన్ రాంబాబు తప్పుమాట్లాడారని తాను అననని.. అనుభవపూర్వకంగా వారికి అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.
రాష్ట్ర సంక్షేమం కోసం మహాయజ్ఞం: రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కోసం అష్టోత్తర శతకుండాత్మక రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈనెల 12 నుంచి 17వరకు ఆరు రోజులపాటు యజ్ఞం జరగనుందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండి, రాష్ట్ర ప్రజలు సౌభాగ్యంతో వర్ధిల్లాలనే లక్ష్యంతో మున్సిపల్ స్టేడియంలో శాస్త్రోక్తంగా, ఆగమ నియమాలకు అనుగుణంగా రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: