తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై చంద్రబాబే దాడులు చేయించారని మంత్రి కొడాలి నాని(minister kodali nani fires on chandrababu news) ఆరోపించారు. పెయిడ్ ఆర్టిస్టులకు జీతమిస్తూ, చెప్పినట్లు మాట్లాడే వారితో చంద్రబాబు రెచ్చగొట్టించారని విమర్శించారు. రాష్ట్రంలో పంచాయతీల నుంచి పార్లమెంట్ వరకు వైకాపా అభ్యర్థులే గెలుస్తున్నారని, దీన్ని సహించలేకే చంద్రబాబు ఇలా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఎంతమంది చంద్రబాబులు వచ్చినా ప్రజల్లో జగన్‌పై ఉన్న అభిమానాన్ని తగ్గించలేరన్నారు. ఇలా కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను ఉసిగొల్పి తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తోందన్నారు.
సీఎం సహా తమను ఎవరు తిట్టినా దానికి మూల కారణం చంద్రబాబేనన్నారు. మోదీని దింపాలని రాహుల్‌తో జట్టుకట్టిన చంద్రబాబు, అమిత్ షాను ఎలా కలుస్తారని..? ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ స్నేహితులేనని, ఇద్దరూ కలసి నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పెయిడ్ ఆర్టిస్టులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబు ఇచ్చిన బంద్ విఫలమైందన్న మంత్రి కొడాలి నాని.. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క బడ్డీకొట్టు కూడా మూయలేదన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి చంద్రబాబు సొంత హెరిటేజ్ షాపులు కూడా తెరిచారని ఎద్దేవా చేశారు.