రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులన్నింటినీ ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఖర్చు చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వైకాపా పాలనలో లక్షన్నర కోట్ల విలువైన పథకాలు అమలు చేశామన్నారు. నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే నగదు జమ చేసినట్లు స్పష్టం చేశారు. వ్యవసాయ, విద్య,వైద్య రంగాల్లో సహ పలు విభాగాల్లో జరుగుతున్న అభివృద్దిపై రాష్ట్రంలో చర్చ జరుగుతోందని.. ప్రభుత్వ పథకాలపై చర్చ జరగకుండా చేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు సహా తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ఆక్రోశంతో తెదేపా నేతలు తమ సర్కారుపై అవాకులు చవాకులుపేల్చుతూ, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి యనమల లెక్కలు చెప్పాలి..
తెదేపా హయాంలో రూ. 1.50 లక్షల కోట్లు అప్పులు చేశారన్న మంత్రి.. తీసుకున్న రుణాలు దేని కోసం ఖర్చు పెట్టారో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యనమల చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి కార్యకలాపాలు కోసమే తెదేపా హయాంలో అప్పులు చేశారన్న మంత్రి.. ఏకంగా రూ. 68 వేల కోట్లు తిన్నారని ఆరోపించారు. వైకాపా రెండేళ్ల పాలనపై చంద్రబాబు, లోకేష్ సహా యనమల రామకృష్ణుడు ప్రభుత్వంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని మంత్రి తప్పుబట్టారు.