తుంగభద్ర పుష్కరాలపై రాష్ట్ర మంత్రులు సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అధికారులతో సమీక్షించారు. పుష్కరాల కోసం చేయాల్సిన ఏర్పాట్ల పై మున్సిపల్ శాఖ, పోలీసు శాఖ, జలవనరుల శాఖ, రహదారులు భవనాల శాఖ అధికారులతో మంత్రులు చర్చించారు.
కర్నూలులోని తుంగభద్రా నది ఘాట్లకు దారి తీసే రహదారి మార్గాల నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను మంజూరు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పుష్కరాల సమయంలో పుణ్య స్నానాల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, ఘాట్ల విస్తరణ తదితర అంశాలపై మంత్రులు చర్చించారు. ఏపీ తో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణా, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశమున్నందున అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.