రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా మిలద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహమ్మద్ ప్రవక్త సూచించిన శాంతి మార్గమే అనుసరణీయమని మత పెద్దలు అన్నారు.
తూర్పుగోదావరిలో...
మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరంలో ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
కర్నూలు జిల్లాలో...
మానవాళి మంచి కోసం మార్గం చూపిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను కర్నూలు జిల్లాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. నగరంలోని పాతబస్తీ నుంచి రాజ్ విహార్ కూడలి వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మత సామరస్యానికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు అల్లా బాటలో నడవాలని మత పెద్దలు సూచించారు.
నెల్లూరు జిల్లాలో...
మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. మత పెద్దలు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర గురించి వివరించారు. మసీదుల వద్ద అన్నదానం ఏర్పాటు చేశారు.
కడప జిల్లాలో...
మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలను కడప జిల్లా జమ్మలమడుగులో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. కడప డీఎస్పీ నాగరాజు, ఆస్థాన గౌసియా పీఠాధిపతి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు.
విశాఖ జిల్లాలో...
విశాఖపట్నంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. మిలాద్ ఘర్లనూ అలంకరించిన ముస్లిం సోదరులు ముహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవితగాథను వర్ణిస్తూ ఊరేగింపు నిర్వహించారు.
అనంతపురం జిల్లాలో...
మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లాలోని కదిరి, హిందూపురం, ఉరవకొండ ప్రాంత్రాల్లో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా చేసుకున్నారు. స్థానిక జామియా మసీదు నుంచి పవిత్రమైన జెండాను పట్టణంలో ఊరేగించారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మక్కా మసీదు ఆకృతితో రూపొందించిన ప్రతిమను వాహనంలో ఉంచి పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్, మత పెద్దలు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో...
మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు వేడుకలను విజయనగరం జిల్లాలో ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని పార్వతీపురంలో జామియా మసీదు నుంచి ఆర్టీసీ కూడలి వరకు గీతాలు ఆలపిస్తూ ర్యాలీగా చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో...
శ్రీకాకుళం జిల్లాలో మహమ్మద్ ప్రవక్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీకాకుళం, పలాస, జామియా మసీదుల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం జరిగిన శాంతిర్యాలీలో ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ... కార్తికమాసం ప్రత్యేకం